వాయనాడు నుండి రాహుల్ పోటీ
ఖరారు చేసిన ఏఐసీసీ హై కమాండ్
న్యూఢిల్లీ – ఏఐసీసీ కీలక ప్రకటన చేసింది. పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా తమ పార్టీకి సంబంధించి అభ్యర్థులను ఖరారు చేసే పనిలో పడింది ఎన్నికల స్క్రీనింగ్ కమిటీ. ఈ మేరకు పార్టీ తరపున ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణు గోపాల్ మీడియాతో మాట్లాడారు. మొత్తం 545 సీట్లకు గాను తొలి విడతగా కాంగ్రెస్ పార్టీ 33 ఎంపీ స్థానాలకు అభ్యర్థులను ఖరారు చేసింది.
తెలంగాణకు సంబంధించి 17 సీట్లకు గాను 4 సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేసింది. అయితే ఏఐసీసీ మాజీ చీఫ్ , ప్రస్తుతం వాయనాడు ఎంపీగా ఉన్న రాహుల్ గాంధీ ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై గత కొంత కాలంగా చర్చోప చర్చలు కొనసాగుతున్నాయి.
ఈసారి జరగబోయే ఎన్నికల్లో వాయనాడు నుండి కాకుండా అమేథి నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం జరిగింది. వాటన్నింటికీ చెక్ పెడుతూ ఏఐసీసీ కీలక నిర్ణయం తీసుకుంది. తిరిగి కేరళ లోని వాయనాడు నుంచే రాహుల్ గాంధీ బరిలోకి దిగుతారని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా ఈసారి ఎన్నికలు నీతికి, అవినీతికి మధ్య జరుగుతున్న యుద్దమని ప్రకటించారు రాహుల్ గాంధీ. ఆయన భారత్ జోడో న్యాయ్ యాత్రను చేపట్టారు. ఈ యాత్రకు అన్ని వర్గాల నుండి భారీ ఎత్తున మద్దతు లభిస్తోంది.