టీడీపీ..జనసేన కొత్త పథకం
కలలకు రెక్కలు పేరుతో స్కీం
అమరావతి – ఏపీలో త్వరలో జరగబోయే శాసన సభ ఎన్నికలకు సంబంధించి అధికారమే లక్ష్యంగా వ్యూహాలు పన్నుతున్నాయి తెలుగుదేశం, జనసేన పార్టీలు. ఇప్పటికే కూటమిగా ఏర్పడ్డాయి. ఎన్నికల్లో పొత్తు కూడా ప్రకటించాయి. ఆయా స్థానాలకు అభ్యర్థులను కూడా ఖరారు చేశాయి. ఇందులో భాగంగా ఇరు పార్టీలు మేని ఫెస్టోను తయారు చేసే పనిలో పడ్డాయి.
తాజాగా మరో కీలక ప్రకటన చేశారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ . ఇందుకు గాను మహిళల్ని మహాశక్తులుగా తీర్చి దిద్దేందుకు టీడీపీ-జనసేన మరో కొత్త పథకాన్ని ప్రకటించింది. ఉన్నత విద్య అభ్యసించాలని ఆడ బిడ్డల కల నెరవేర్చేందుకు ‘కలలకు రెక్కలు’ పథకాన్ని రూపొందించారు.
ఇంటర్ పూర్తయ్యాక దేశంలో ఎక్కడైనా నచ్చిన కోర్సులో చేరేందుకు విద్యార్థిని తీసుకునే రుణానికి ప్రభుత్వం హామీదారుగా ఉండటమే ఉంటుందని తెలిపారు. ఈ కోర్సు కాలానికి వడ్డీని ప్రభుత్వమే భరించే ఈ పథకం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రకటించడం చాలా ఆనందంగా ఉందన్నారు.
ఆడబిడ్డలకు అవకాశాలు కల్పిస్తామని, స్వేచ్చగా ఎదిగేందుకు రక్షణ కల్పిస్తామని తెలిపారు. కలలకు రెక్కలు పథకంలో మీ పేరును ఇప్పుడే నమోదు చేసుకోవచ్చని తెలిపారు. ఇందుకు గాను https://kalalakurekkalu.com వెబ్ సైట్ ను సందర్శించాలని సూచించారు నారా లోకేష్ బాబు.