టీఎస్ఆర్టీసీ ఉద్యోగులకు ఖుష్ కబర్
21 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ ప్రకటన
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఉద్యోగులకు తీపి కబురు చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్. ఏకంగా 21 శాతం ఫిట్ మెంట్ తో పీఆర్సీ ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్.
2017 కు సంబంధించిన పీఆర్సీని పూర్తి స్థాయిలో ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని ప్రకటించారు మంత్రి. ఆర్టీసీ ఉద్యోగుల సంక్షేమం కోసం దీనిని ప్రకటిస్తున్నట్లు తెలిపారు. దేశంలో ఎక్కడా లేని రీతిలో ఆర్టీసీ ఉద్యోగులు కష్ట పడుతున్నారని, వారి సేవలు ప్రశంసనీయమని పేర్కొన్నారు.
తమ ప్రభుత్వం వచ్చిన వెంటనే మహాలక్ష్మి పథకం తీసుకు వచ్చిందన్నారు. ఇందులో భాగంగా పల్లె వెలుగు, ఎక్స్ ప్రెస్ బస్ సర్వీస్ లలో మహిళలకు ఉచితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఎంత దూరమైనా ప్రయాణం చేసే సౌకర్యాన్ని కల్పించామన్నారు.
ఎండీ వీసీ సజ్జనార్ సారథ్యంలోని టీఎస్ఆర్టీసీ ఉద్యోగులు శ్రమకోర్చి 48 గంటల్లోనే అమలులోకి తీసుకు వచ్చారని, వారి సేవలను మరిచి పోలేమన్నారు. గత సర్కార్ ఆర్టీసీని అమ్మాలని అనుకుందన్నారు. కానీ తాము దానిని నిలబెట్టే ప్రయత్నం చేస్తున్నామని చెప్పారు.