ప్రకటించిన మాజీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత
హైదరాబాద్ : సింగరేణి సంస్థను కాపాడుకునేందుకు ఉద్యమిస్తామని హెచ్చరించారు తెలంగాణ జాగృతి సంస్థ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత. ఆదివారం తెలంగాణ జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి , హెచ్ఎంఎస్ అధ్యర్యంలో నిర్వహించిన సేవ్ సింగరేణి రౌండ్ టేబుల్ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. కార్మికుల నియామకాలపై కాదు మీ అవినీతిపై ఎంక్వైరీ జరిపించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క పై కవిత ఫైర్ అయ్యారు. కార్మికులకు ఉద్యోగాలు ఇస్తే ఎంక్వైరీ చేస్తారా… ఆ మాటలు బంద్ పెట్టి ముందు మెడికల్ బోర్డు పెట్టాలన్నారు. కార్మికుల వారసులకు డిపెండెంట్ ఉద్యోగాలు ఇవ్వాలనేది అప్పటి ప్రభుత్వ పాలసీ అని పేర్కొన్నారు.
రాజస్థాన్ లో సోలార్ ఒప్పందం, లిథియం రిఫైనరీ కోసం చిన్న సంస్థతో ఒప్పందంలో జరిగిన అవినీతిపై విచారణకు సిద్ధమా అని సవాల్ విసిరారు కల్వకుంట్ల కవిత. సింగరేణికి ప్రభుత్వం బాకీ ఉన్న రూ.47 వేల కోట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సింగరేణిని కాపాడుకునేందుకు మరో ఉద్యమానికి సిద్ధమని కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. డిపెండెంట్ కార్మికుల నియామకాలపై విజిలెన్స్, ఏసీబీ విచారణ చేస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క అనడం విడ్డూరంగా ఉందన్నారు .ఏ దేశంలోనైనా, ఏ రాష్ట్రం లోనైనా సహజ వనరులను అక్కడి ప్రజలకు ఉపయోగపడే విధంగా వాడేందుకు ప్రయత్నం చేస్తారని చెప్పారు. ప్రకృతి మనకు బొగ్గు వరంగా ఇచ్చింది. దీన్ని ప్రజలకు మేలు చేసే విధంగా వాడేలా ప్రభుత్వం ఉండాలన్నారు.





