దేశంలో ఇది చీకటి రోజు
నిప్పులు చెరిగిన కేఏ పాల్
అమరావతి – ప్రజాశాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కేఏ పాల్ నిప్పులు చెరిగారు. టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్ లపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బాబు, పవన్ కళ్యాణ్ లు మోదీ, అమిత్ షాలతో భేటీ కావడం, ఎన్నికల్లో పొత్తు కుదుర్చు కోవడంపై మండిపడ్డారు. ఏపీ రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో ఈ ఇద్దరు కలిసి తాకట్టు పెట్టారంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక రకంగా చెప్పాలంటే ఇవాళ ఏపీకి సంబంధించి అత్యంత బాధాకరమైన రోజుగా..అంతకంటే ఎమర్జెన్సీని తలపింప చేసే చీకటి రోజుగా అభివర్ణించారు. గతంలో మోదీని, షాను అనరాని మాటలు అన్న చంద్రబాబు ఇవాళ ఏం ముఖం పెట్టుకుని పొత్తు పెట్టుకున్నాడో చెప్పాలని అన్నారు. కేవలం తన కొడుకు నారా లోకేష్ ను సీఎంను చేసేందుకు, తన బినామీ సోదరులను కాపాడు కునేందుకే లొంగి పోయారని ఆరోపించారు డాక్టర్ కేఏ పాల్.
పవన్ కళ్యాణ్ తన దత్తత తండ్రిని మూర్ఖంగా అనుసరిస్తున్నాడంటూ ఎద్దేవా చేశారు. ఏపీని అప్పుల కుప్పగా మార్చిన ఘనత చంద్రబాబుది కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ తమ వ్యక్తిగత అవసరాల కోసం మన ఉక్కు పరిశ్రమను , తెలుగు ప్రజల ఆత్మ గౌరవాన్ని తాకట్టు పెట్టారని ధ్వజమెత్తారు. ప్రజల కోసం పని చేసే ప్రజా శాంతి పార్టీలో చేరాలని పిలుపునిచ్చారు. అంబేద్కర్, గద్దర్ , బాబు మోహన్ ఆశయాలను నెరవేర్చేందుకు ముందుకు రావాలని కోరారు.