ఆర్టీసీ కార్మికుల శ్రమ ఫలించింది
కాంగ్రెస్ సర్కార్ కు ఎండీ థ్యాంక్స్
హైదరాబాద్ – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి సారథ్యంలోని తెలంగాణ రాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. ప్రజలకు నిరంతరం విశిష్ట సేవలు అందిస్తున్న తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ)కు చెందిన వేల మందికి పైగా కార్మికులు, ఉద్యోగులు, సిబ్బందికి తీపి కబురు చెప్పింది. నిన్నటి దాకా నష్టాల్లో ఉన్న సంస్థను లాభాల బాట వైపు పయనించేలా చేయడంలో కీలక పాత్ర పోషించారు మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్.
తాజాగా రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ సంచలన ప్రకటన చేశారు. ఈ మేరకు ఆర్టీసీ కార్మికులకు తీపి కబురు చెప్పారు. సంస్థకు వెన్ను దన్నుగా నిలుస్తూ వస్తున్న కార్మికులకు 2017కు సంబంధించిన పే స్కేల్ పై 21 శాతం ఫిట్ మెంట్ ను ఇస్తున్నట్లు ప్రకటించారు.
ఈ ఫిట్ మెంట్ ఆ ఏడాది (2017) ఏప్రిల్ నుంచి అమలులోకి వస్తుందని స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా ఫిట్ మెంట్ ప్రకారం కొత్త వేతనాలు ఈ ఏడాది జూన్ 1 నుంచి అమలులోకి వస్తాయని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 53,071 మంది ఉద్యోగులకు లబ్ది చేకూరనుంది.
కాగా ఆర్టీసీ సంస్థ ఉద్యోగుల శ్రమను గుర్తించి వేతన సవరణకు అనుమతించిన సీఎం రేవంత్ రెడ్డికి, డిప్యూటీ సీఎం భట్టికి, మంత్రి పొన్నంకు ధన్యవాదాలు తెలిపారు ఎండీ సజ్జనార్.