ఏం సాధించారని పొత్తులు
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. ఆమె టీడీపీ చీఫ్ నారా చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ చీఫ్ పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు దగ్గుబాటి పురందేశ్వరి లను ఏకి పారేశారు. ఎవరి ప్రయోజనాల కోసం మీరు పొత్తు పెట్టుకున్నారో చెప్పాలంటూ డిమాండ్ చేశారు వైఎస్ షర్మిల.
ప్రజలను ఇంత కాలం మోసం చేశారని, ఇప్పుడు కొత్త రకంగా పొత్తుల పేరుతో మోసం చేసేందుకు ప్రయత్నం చేస్తున్నారంటూ సంచలన ఆరోపణలు చేశారు ఏపీ పీసీసీ చీఫ్. రాష్ట్ర ప్రజల ఆత్మ గౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారంటూ మండిపడ్డారు. మీ మీ వ్యక్తిగత ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని తాకట్టు ఎలా పెడతారంటూ ప్రశ్నించారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
ఏపీని అప్పుల కుప్పగా మార్చిన ఘనత చంద్రబాబుకు దక్కుతుందన్నారు. ఆయనను చూసి జగన్ రెడ్డి 8 లక్షల కోట్ల అప్పు తీసుకు వచ్చాడని ఆరోపించారు. అందరూ దొంగలేనంటూ సంచలన కామెంట్స్ చేశారు వైఎస్ షర్మిలా రెడ్డి.
గతంలో బాబు పాలనలో ఏం జరిగిందో చూశామని, ఇప్పుడు జగన్ రెడ్డి అరాచక పాలన చూస్తున్నామని, ఎవరు పవర్ లోకి వచ్చినా ఒరిగేది ఏమీ ఉండదన్నారు. రాష్ట్రంలో ఎవరికి ఓటు వేసినా అది బీజేపీకి ఓటు వేసినట్టేనని చెప్పారు.