ఎల్ఆర్ఎస్ పేరుతో సర్కార్ దోపిడీ
నిప్పులు చెరిగిన మాజీ మంత్రి కేటీఆర్
హైదరాబాద్ – ఎల్ఆర్ఎస్ పేరుతో దోపిడీ చేసేందుకు సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ తెర లేపిందంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఈ సందర్బంగా ఆయన సుదీర్ఘ లేఖ రాశారు. ఎల్ఆర్ఎస్ ను ఎలాంటి ఛార్జీలు లేకుండా అమలు చేయాలని కోరారు.
గతంలో మీతో సహా మీ సహఛర మంత్రులు చెప్పిన మాటలు, హామీలను దృష్టిలో ఉంచుకుని ఉచితంగా ఎల్ఆర్ఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు కేటీఆర్. గతంలో ఇచ్చిన మాటను తప్పినందుకు లేదా ప్రజలకు అబద్ధాలు చెప్పినందుకు క్షమాపణ కోరాలని అన్నారు మాజీ మంత్రి.
ఎల్ఆర్ఎస్ అంటే దోపిడీ అన్న మీరు ఇవాళ ప్రజలను ఎందుకు దోపిడీ చేస్తున్నారో వివరించాల్సిన బాధ్యత మీపై లేదా అని ప్రశ్నించారు. ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల డిమాండ్ ను నిరసన రూపంలో , వినతి పత్రాల రూపంలో తెలియ చేశామని పేర్కొన్నారు కేటీఆర్.
మెజారిటీ ప్రజల ఆకాంక్షల, డిమాండ్ మేరకు ఉచితంగా ఎల్ఆర్ఎస్ ను అమలు చేయాలని ఈ మేరకు మార్గదర్శకాలు విడుదల చేయాలని సీఎంను కోరారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఇదిలా ఉండగా గతంలో పలు సందర్భాలలో , సమావేశాలలో కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డితో పాటు పలువురు మంత్రులు తాము పవర్ లోకి వస్తే ఎల్ఆర్ఎస్ ను ఉచితంగా అమలు చేస్తామన్న సంగతి గుర్తు చేశారు.