NEWSTELANGANA

త్వ‌ర‌లో మెగా మాస్ట‌ర్ ప్లాన్

Share it with your family & friends

ప్ర‌క‌టించిన సీఎం రేవంత్ రెడ్డి

హైద‌రాబాద్ – రాష్ట్ర సమగ్ర అభివృద్ధి కోసం త్వరలోనే వైబ్రంట్‌ తెలంగాణ – 2050 మెగా మాస్టర్‌ ప్లాన్‌ ప్రకటించబోతున్నట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. తెలంగాణను మూడు విభాగాలుగా సమాన అభివృద్ధి కోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు.

ఎల్బీనగర్ బైరామల్‌గూడ చౌరస్తాలో కొత్తగా నిర్మించిన రెండో ఫ్లైఓవర్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. వైబ్రంట్‌ తెలంగాణపై కీలక అంశాలను ప్రస్తావించారు.

ఔటర్‌ రింగ్‌ రోడ్డు లోపల ఉన్న మున్సిపాలిటీలు, పంచాయతీలన్నింటినీ ఒకే గొడుకు కిందకు తెచ్చి అర్బన్‌ తెలంగాణగా, 354 కి.మీ మేరకు ఓఆర్‌ఆర్‌ నుంచి ప్రతిపాదిత రీజినల్‌ రింగ్‌ రోడ్డు ప్రాంతాన్ని సబర్బన్ తెలంగాణగా, అక్కడి నుంచి తెలంగాణ సరిహద్దు ప్రాంతం వరకు రూరల్‌ తెలంగాణగా రాష్ట్రాన్ని మొత్తం మూడు విభాగాలుగా త‌యారు చేసిన‌ట్లు చెప్పారు. ఈ సంద‌ర్బంగా సమగ్రాభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించ బోతున్నట్టు వెల్ల‌డించారు.

వైబ్రంట్‌ తెలంగాణ 2050 మెగా మాస్టర్ ప్లాన్‌ కోసం అంతర్జాతీయ కన్సల్టెన్సీని నియమించిన విషయాన్ని గుర్తు చేశారు. ఆ ప్రణాళిక వచ్చిన తర్వాత ప్రజల నుంచి అభిప్రాయ సేకరణ చేసి ఆ మాస్టర్ ప్లాన్‌ను విడుదల చేస్తామన్నారు సీఎం.

హైదరాబాద్ నగరం చుట్టూ అన్ని ప్రాంతాల్లో సమానమైన అభివృద్ధి సాధించాలన్నదే ప్రభుత్వ లక్ష‍్యమ‌ని పేర్కొన్నారు. మూసీ రివర్‌ ఫ్రంట్ డెవలప్‌మెంట్‌ కింద అంతర్జాతీయ ప్రమాణాలతో మూసీని అభివృద్ధి చేస్తామ‌న్నారు.