ఆ ముగ్గురు మోదీకి తొత్తులు
నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల
అమరావతి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలా రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్ , జగన్ మోహన్ రెడ్డి ప్రధాని మోదీకి తొత్తులుగా మారారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మైలవరం నియోజకవర్గం కొండపల్లిలో జరిగిన రచ్చబండ కార్యక్రమానికి హాజరయ్యారు వైఎస్ షర్మిల.
ఏపీ ప్రజలను భారతీయ జనతా పార్టీ వెన్నుపోటు పొడిచిందన్నారు. జగనన్న , చంద్రబాబు, పవన్ రాష్ట్రాన్ని మోసం చేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మెగా డీఎస్సీ వేస్తానని కేవలం 7 వేల ఉద్యోగులు మాత్రమే ఇచ్చారని అన్నారు.
ఇక జగనన్న మెగా డీఎస్సీ అంటూ దగా డీఎస్సీ తెచ్చారు. వీరిద్దరిలో ఎవరూ అధికారంలోకి వచ్చినా ఉపయోగం లేదన్నారు. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టు కోలేదని ఆరోపించారు వైఎస్ షర్మిల.
పేద ఆడబిడ్డలకు అండగా ఉండటానికి ‘ఇందిరమ్మ అభయం’ పేరుతో ఓ పథకాన్ని తీసుకొచ్చామన్నారు . ఈ పథకం ద్వారా ప్రతి నెల 5 వేల రూపాయలు ఆ ఇంటి మహిళ పేరు మీద ఇవ్వనున్నామని ప్రకటించారు.
కేంద్రంలో అధికారంలోకి వచ్చినా, రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినా ఈ పథకం అమలు చేస్తామని అన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ప్రత్యేక హోదా, రాజధాని, పోలవరం నిర్మాణంతో పాటు ఇందిరమ్మ అభయం కూడా వస్తుందన్నారు.