ఆర్టీసీ విలీనంపై ఫోకస్ – పొన్నం
సంస్థ సేవలు ప్రశంసనీయం
హైదరాబాద్ – రాష్ట్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కీలక ప్రకటన చేశారు. విశిష్ట సేవలు అందిస్తున్న ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేసే విషయం ఆలోచిస్తామని తెలిపారు. ఆదివారం ఆయన ఎండీ సజ్జనార్ తో కలిసి మాట్లాడారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన 48 గంటల్లోపు ఆర్టీసి లో మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిందన్నారు. దానిని అమలు చేయడంలో ఆర్టీసి సంస్థ సక్సెస్ అయ్యిందన్నారు. ప్రభుత్వం తరపున అభినందిస్తున్నట్లు చెప్పారు పొన్నం ప్రభాకర్.
ఇప్పటి వరకు మహాలక్ష్మి పథకం కింద 25 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని వెల్లడించారు. కష్టపడి పనిచేస్తున్న సిబ్బందికి కృతజ్ఞతలు తెలియ చేస్తున్నామని అన్నారు. పెండింగ్ లో ఉన్న 280 కోట్ల బకాయిలను రెండు రోజుల్లో చెల్లిస్తామన్నారు మంత్రి.
దీంతో పాటు 2017లో ప్రకటించిన 17 శాతం పీఆర్సీపై కీలక నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. నష్టాల్లో నుండి లాభాల్లోకి వెళుతుందన్నారు. 21 శాతం ఫిట్మెంట్ ఇచ్చేందుకు సర్కార్ అంగీకరించిందని తెలిపారు. ప్రతి ఏటా 418.11 కోట్ల భారం పడుతుందన్నారు.
ఆర్టీసీ కుటుంబాలన్నీ గంప గుత్తగా తమకు మద్దతు ఇచ్చాయని, వారికి అండగా ఉంటామన్నారు పొన్నం ప్రభాకర్ గౌడ్. జూన్ 1 నుండి అమలులోకి వస్తుందన్నారు. 60 శాతం ఉన్న అక్యుపెన్సీ ఇప్పుడు 100 శాతానికి చేరుకుందన్నారు. ఆర్టీసీలో కొత్తగా ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. 3 వేల కొత్త బస్సులు రానున్నట్లు తెలిపారు.