సీఎంపై కాటిపల్లి కన్నెర్ర
కామారెడ్డిని షబ్బీర్ అలీకి రాసిచ్చాడా
కామారెడ్డి – భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి నిప్పులు చెరిగారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ప్రోటోకాల్ విషయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన ప్రభుత్వ సలహాదారుగా ఉన్న షబ్బీర్ అలీని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రోటోకాల్ కామా రెడ్డిలోనే ఉంటుందా అని నిలదీశారు సీఎం ఎనుముల రేవంత్ రెడ్డిని. ఇలాంటి చిల్లర రాజకీయాలు చేయిద్దంటూ సూచించారు.
ప్రజలు అన్నింటిని గమనిస్తారని అన్నారు. అందుకే తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో విజయ గర్వంతో విర్ర వీగిన సీఎం రేవంత్ రెడ్డిని, అహంకారంతో మిడిసి పడిన మాజీ సీఎం కల్వకుంట్ల చంద్రశేఖర్ రావును తమ ఓటు అనే ఆయుధంతో బండ కేసి కొట్టారని గుర్తు చేశారు.
త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో తమ సత్తా ఏమిటో చూపిస్తామని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో అందరికీ సమాన ప్రాతినిధ్యం ఉంటుందని అన్నారు కాటిపల్లి వెంకట రమణా రెడ్డి. ఇకనైనా చిల్లర రాజకీయాలు మానుకోవాలని సూచించారు. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు ఎమ్మెల్యే.