NEWSANDHRA PRADESH

మూడు రాజ‌ధానుల పేరుతో ద‌గా

Share it with your family & friends

నిప్పులు చెరిగిన వైఎస్ ష‌ర్మిలా రెడ్డి

అమ‌రావ‌తి – ఏపీ పీసీసీ చీఫ్ వైఎస్ ష‌ర్మిల నిప్పులు చెరిగారు. మూడు రాజ‌ధానుల పేరుతో మోసం చేయ‌డం త‌ప్ప జ‌గ‌న్ రెడ్డి ఏపీకి చేసింది ఏమీ లేద‌న్నారు. ఎన్నిక‌లు వ‌స్తున్నాయ‌ని మ‌రో కొత్త నాట‌కానికి తెర లేపాడ‌ని ఆరోపించారు. ఇప్ప‌టి వ‌ర‌కు ఏపీకి ప్ర‌త్యేక హోదా ఎందుకు ఇవ్వ‌లేద‌ని ఏనాడైనా నిల‌దీశారా అని ప్ర‌శ్నించారు. ప్ర‌జ‌ల‌ను కేవ‌లం ఓటు బ్యాంకు గా చూశార‌ని, ఈసారి ఎన్నిక‌ల్లో జ‌గ‌న్ రెడ్డికి, ఆయ‌న ప‌రివారానికి చుక్క‌లు చూపించ‌డం ఖాయ‌మ‌ని జోష్యం చెప్పారు వైఎస్ ష‌ర్మిలా రెడ్డి.

ఇదే స‌మ‌యంలో ఏపీకి అన్ని విధాలుగా అండ‌గా ఉంటామ‌ని, ప్ర‌త్యేక హోదా త‌ప్ప‌కుండా ఇస్తామ‌ని మాటిచ్చి త‌ప్పిన ప్ర‌ధాన మంత్రి మోదీతో ఎలా పొత్తు పెట్టుకుంటారంటూ టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు, జ‌న‌సేన పార్టీ చీఫ్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ ల‌ను నిల‌దీశారు.

జ‌గ‌న్ రెడ్డి అయితే ఏకంగా మోదీకి , కేంద్రానికి త‌ల వంచార‌ని, కానీ త‌న తండ్రి దివంగ‌త వైఎస్ రాజ‌శేఖ‌ర్ రెడ్డి ఏనాడూ త‌ల దించి లేద‌ని గుర్తు చేశారు. త‌న తండ్రికి త‌న అన్న‌కు మ‌ధ్య చాలా తేడా ఉంద‌న్నారు. ఆయ‌న మాటిస్తే త‌ప్పే ర‌కం కాద‌న్నారు.

కానీ జ‌గ‌న్ రెడ్డి ఇచ్చిన మాట‌కు క‌ట్టుబ‌డ లేద‌న్నారు. రాష్ట్రంలో రెండున్న‌ర ల‌క్ష‌ల జాబ్స్ భ‌ర్తీ చేస్తామ‌ని చెప్పార‌ని కానీ ఇప్ప‌టి దాకా కొన్ని పోస్టులు మాత్ర‌మే భ‌ర్తి చేశార‌ని ధ్వ‌జ‌మెత్తారు. సిద్దం స‌భ‌ల పేరుతో కోట్లాది రూపాయ‌ల ప్ర‌జా ధనాన్ని ఖ‌ర్చు చేస్తున్నారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు.