సీతారాముడి సన్నిధిలో సీఎం
పూజలు చేసిన డిప్యూటీ సీఎం , మంత్రి
భద్రాచలం – సీఎం ఎనుముల రేవంత్ రెడ్డి ఖమ్మం జిల్లా భద్రాచలంలో కొలువు తీరిన సీతా రామ చంద్ర స్వామిని దర్శించుకున్నారు. ఆలయ కమటీ ఆధ్వర్యంలో సీఎంకు ఘన స్వాగతం లభించింది. ఆలయ అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. అనంతరం శ్రీరామ చంద్ర స్వామి వారికి ప్రత్యేక పూజలు చేపట్టారు. ఆశీర్వచనాలు అందుకున్నారు.
ఆలయ కమిటీ సీఎంతో పాటు ఉప ముఖ్య మంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కొండా సురేఖ , ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటి రెడ్డి వెంకట్ రెడ్డిలకు శాలువాలు కప్పి సన్మానించారు. అనంతరం ప్రసాదంతో పాటు స్వామి, అమ్మ వార్ల చిత్ర పటాలను బహూకరించారు.
ఆలయాన్ని దర్శించుకున్న అనంతరం సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. స్వామి, అమ్మ వార్ల అనుగ్రహంతో ఖమ్మం జిల్లాలో అత్యధిక స్థానాలను కాంగ్రెస్ పార్టీ గెలుచుకుందని గుర్తు చేశారు. ఈ రాష్ట్రంలోని ప్రజలందరు సుఖ సంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించడం జరిగిందని చెప్పారు.
రాష్ట్రంలోని ఆలయాల అభివృద్దికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ఎనుముల రేవంత్ రెడ్డి.