టెక్నాలజీ వ్యసనం ప్రమాదం
ఈటల రాజేందర్ ఆవేదన
మల్కాజిగిరి – భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సంపద పెరిగినా ప్రశాంతత అన్నది లేకుండా పోయిందన్నారు. మల్కాజిగిరి పార్లమెంట్ నియోజకవర్గం నుంచి ఆయన బీజేపీ తరపున ఎంపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ఈ సందర్బంగా విస్తృతంగా పర్యటిస్తూ ప్రచారం చేస్తున్నారు.
నియోజకవర్గ పరిధిలోని ఆనంద్ భాగ్ లో వాయిద్య కళాకారుల సంఘం ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కు హాజరై ప్రసంగించారు ఈటల రాజేందర్. అప్పట్లో మానసిక ప్రశాంతతో కూడిన జీవనం ఉండేదని పేర్కొన్నారు. కానీ ఇప్పుడు ఆ శాంతి అన్నది లేకుండా పోయిందని ఆవేదన చెందారు.
పిల్లలు ఇప్పుడు సెల్ ఫోన్ తో, టివితో మాట్లాడుతున్నారు తప్ప మనతో మాట్లాడడం లేదని వాపోయారు ఈటల. హైదరాబాద్ లో డ్రగ్స్ రాజ్యమేలుతున్నాయని వాటిని నియంత్రించడంలో ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రభుత్వాలు ప్రజలపై ఒత్తిళ్లను తగ్గించేందుకు ప్రయత్నం చేయాలని సూచించారు ఈటల రాజేందర్.
మానవ సంబంధాల ప్రతి రూపమే రామాయణమని, పరిపాలన ఎలా ఉండాలో చెప్పిందే మహా భారతమని స్పష్టం చేశారు.