NEWSTELANGANA

అన్న‌దాత‌లూ ఆందోళ‌న చెందొద్దు

Share it with your family & friends

ఎమ్మెల్యే య‌శ‌స్విని రెడ్డి భ‌రోసా

పాల‌కుర్తి – రైతుల‌కు త‌మ ప్ర‌భుత్వం అండ‌గా ఉంటుంద‌ని ఎలాంటి ఆందోళ‌న చెంద‌వద్ద‌ని కోరారు ఎమ్మెల్యే య‌శ‌స్విని రెడ్డి. మిషన్ భగీరథ గెస్ట్ హౌస్ లో రైతులకి ధర్మ సాగర్ రిజర్వాయర్ నుండి నీళ్లు విడుదల పై క్లారిటీ ఇచ్చే ప్ర‌య‌త్నం చేశారు.

ధర్మసాగర్ రిజర్వాయర్ నుండి నీళ్లు విడుదల అయ్యాయ‌ని, కండ్లు తెరిచి చూస్తే కనపడుతాయ‌ని అన్నారు. కానీ కొంద‌రు కావాల‌ని అస‌త్య ప్ర‌చారం చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఇలాంటి చిల్ల‌ర రాజ‌కీయాలు చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. ఎన్నిక‌ల్లో ప్రజలు తిరస్కరించినా మీ తీరులో మార్పు లేక పోవ‌డం దారుణ‌మ‌న్నారు య‌శ‌స్విని రెడ్డి.

చివ‌రి ఆయ‌క‌ట్టు వ‌ర‌కు నీళ్లు అందించ‌డం త‌మ బాధ్య‌త అని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం చెందాల్సిన అవస‌రం లేద‌న్నారు ఎమ్మెల్యే. సాగు నీరు అందించే దాకా తాను నిద్ర పోన‌ని హామీ ఇచ్చారు.

మాజీ మంత్రి ఎర్ర‌బెల్లి త‌న తీరు మార్చు కోవాల‌ని లేక పోతే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు య‌శ‌స్విని రెడ్డి. తాము ప్ర‌జ‌ల కోసం ప‌ని చేస్తున్నామ‌ని, అబ‌ద్దాల‌తో ప్ర‌భుత్వాన్ని న‌డ‌ప‌డం లేద‌న్నారు.