భారీగా శ్రీశైల మల్లన్న హుండీ ఆదాయం
ఘనంగా ముగిసిన బ్రహ్మోత్సవాలు
శ్రీశైలం – మహా శివరాత్రి సందర్బంగా ప్రముఖ పుణ్య క్షేత్రం శ్రీశైలంలో బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవోపేతంగా ముగిశాయి. ఏపీ దేవాదాయ ధర్మాదాయం శాఖ ఆధ్వర్యంలో శ్రీశైల ఆలయ పాలక మండలి పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేసింది. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు తండోప తండాలుగా.
నల్లమల్ల అడవుల్లో కొలువై ఉన్న శ్రీ మల్లికార్జున స్వామిని దర్శించుకుంటే సకల అరిష్టాలు తొలగి పోతాయని, ఇబ్బందులు ఉండవని, కోరిన కోర్కులు తీరుతాయని కోట్లాది మంది భక్తుల ప్రగాఢ నమ్మకం..విశ్వాసం కూడా.
ఇదే సమయంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, ఛత్తీస్ గఢ్ , ఒడిశా, న్యూఢిల్లీ, తమిళనాడు తదితర ప్రాంతాల నుంచి భక్తులు తరలి వచ్చారు. మల్లన్నను దర్శించుకున్నారు. ఈ సందర్బంగా వేలాది మంది కాలి నడకన స్వామిని దర్శించుకుని పునీతులయ్యారు.
ఇదిలా ఉండగా తాజాగా శ్రీశైలంలో శ్రీ స్వామి, అమ్మవారి ఉభయ ఆలయాల హుండి లెక్కించారు. మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో మల్లన్నకు భారీగా హుండీ ఆదాయం సమకూరింది. 13 రోజుల హుండీ ఆదాయం 5 కోట్ల 16 లక్షలు 84 వేల 417 నగదు లభించిందని పాలక మండలి వెల్లడించింది. అంతే కాకుండా 122 గ్రాముల బంగారం, 5 కేజీల 900 గ్రాముల వెండి లభ్యమైందని తెలిపింది. వివిధ దేశాలకు చెందిన విదేశీ కరెన్సీ కూడా ఇందులో వచ్చిందని పేర్కొంది.