టీటీడీ పాలక మండలి కీలక నిర్ణయాలు
వెల్లడించిన చైర్మన్ భూమన , ఈవో ఏవీ
తిరుమల – టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో టీటీడీ ధర్మకర్తల మండలి సమావేశమైంది. ఈ సందర్బంగా కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు టీటీడీ చైర్మన్ భూమన.
స్విమ్స్ ఆసుపత్రిలో రోగుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతున్న నేపథ్యంలో మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు 479 నర్సు పోస్టులు భర్తీ చేసేందుకు ఆమోదం తెలిపిందని చెప్పారు.
టీటీడీలో గతంలో చాలా మంది నోటిఫికేషన్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ (ఆర్‌వోఆర్) ద్వారా కాకుండా బోర్డు ఆమోదంతో పరిపాలనా సౌలభ్యం కోసం కాంట్రాక్టు/పొరుగు సేవల ఉద్యోగులను తీసుకోవడం జరిగిందన్నారు. జి.ఓ.నం.114 ప్రకారం కొన్ని నిబంధనలను సడలించి వారి సేవలు క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వానికి నివేదిక పంపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు.
టీటీడీ కళాశాలల్లో ప్రవేశం పొందిన విద్యార్థినీ విద్యార్థులందరికీ ఎలాంటి సిఫారసు లేకుండా హాస్టల్ వసతి కల్పించడం కోసం అవసరమైన హాస్టళ్ల నిర్మాణానికి ఆమోదం తెలిపిందని పేర్కొన్నారు. రూ.1.88 కోట్లతో తిరుమలలో భక్తుల సౌకర్యార్థం పిఏసి-1 లో 10 లిఫ్టులు ఏర్పాటుకు టెండరు ఆమోదం లభించిందన్నారు.
రూ.1.50 కోట్లతో బాలాజి నగర్ తూర్పువైపున, అదేవిధంగా, శ్రీ పద్మావతి విశ్రాంతి భవనం ఔటర్ కార్డన్ ప్రాంతంలో మిగిలి పోయిన ఫెన్సింగ్ ఏర్పాటుకు ఆమోదం తెలిపిందన్నారు. రూ.14 కోట్లతో తిరుమలలో టీటీడీ ఉద్యోగుల పాత సి టైప్, డి టైప్, కొత్త సి టైప్, డి టైప్ క్వార్టర్లలో మిగిలి ఉన్న 184 క్వార్టర్ల అభివృద్ధి పనులు చేపట్టేందుకు పాలక మండలి ఓకే చెప్పిందన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.
తిరుపతి శ్రీ గోవింద రాజ స్వామి వారి ఆలయంలోని భాష్యకార్ల సన్నిధిలోని మకర తోరణానికి, శ్రీ పార్థసారథి స్వామి, శ్రీ కల్యాణ వేంకటేశ్వర స్వామి వారి తిరువాభరణాలకు బంగారు పూత పూసేందుకు ఆమోదం లభించిందన్నారు.
టీటీడీ ఐటీ సేవల కోసం టైర్ 3 డేటా సెంటర్, డిజాస్టర్ రికవరీ సెంటర్ ఉన్నాయని, ఐటి స్టాండర్డ్ ప్రోటోకాల్ ప్రకారం లైఫ్ సైకిల్ మేనేజ్‌మెంట్ ప్రక్రియలో భాగంగా ప్రతి ఏడు సంవత్సరాలకోసారి టెక్ రీప్లేస్‌మెంట్ చేయాల్సి ఉందన్నారు. ఇందులో భాగంగా ఐదేళ్ల పాటు డేటా సెంటర్ల మెయింటెనెన్స్ కోసం రూ.12 కోట్లు మంజూరుకు ఆమోదం తెలిపిందన్నారు.
ఈ సమావేశంలో దేవాదాయ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కరికాలన్ వలవన్, ఈవో ఎవి.ధర్మారెడ్డి, జేఈవో వీరబ్రహ్మం, పలువురు బోర్డు సభ్యులు పాల్గొన్నారు.