మహిళా సంక్షేమం కాంగ్రెస్ లక్ష్యం
స్పష్టం చేసిన రాహుల్ గాంధీ
న్యూఢిల్లీ – దేశం అభివృద్ది చెందడంలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారని అన్నారు ఏఐసీసీ మాజీ చీఫ్, వాయనాడు ఎంపీ రాహుల్ గాంధీ. భారత్ జోడో న్యాయ్ యాత్ర సందర్భంగా ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ దేశంలో కులం, మతం పేరుతో రాజకీయాలు కొనసాగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.
తాము పవర్ లోకి వస్తే మహిళల సంక్షేమం తమ పార్టీ ప్రధాన లక్ష్యంగా పని చేస్తుందని చెప్పారు. ఇందుకు గాను ఐదు గ్యారెంటీలను అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. ఐదు పథకాలను తీసుకు వస్తున్నామని స్పష్టం చేశారు రాహుల్ గాంధీ.
మహాలక్ష్మి పథకం కింద పేద కుటుంబానికి చెందిన ప్రతీ మహిళలకు ఏడాదికి లక్ష రూపాయలు సాయంగా అందజేస్తామన్నారు. కేంద్ర సర్కార్ ఆధ్వర్యంలో నియమించే కొత్త ఉద్యోగాలలో కనీసం 50 శాతానికి పైగా మహిళలకు కేటాయిస్తామని చెప్పారు.
అంతే కాకుండా ఆశా, అంగన్ వాడీ , మధ్యాహ్నం భోజనం తయారు చేసే మహిళలకు నెల వారీ జీతంలో కేంద్ర ప్రభుత్వ సహకారం రెట్టింపు చేస్తామని అన్నారు రాహుల్ గాంధీ. ప్రతి గ్రామ పంచాయతీలో మహిళలకు సంబంధించి హక్కుల గురించి అవగాహన కల్పించేలా చేస్తామన్నారు. దేశంలోని ప్రతి జిల్లా కేంద్రంలో సావిత్రి భాయి పూలే పేరుతో సంక్షేమ వసతి గృహాలను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు రాహుల్ గాంధీ.