గడువులోగా ఎలక్టోరల్ బాండ్ల వివరాలు
స్పష్టం చేసిన కేంద్ర ఎన్నికల కమిషనర్
న్యూఢిల్లీ – కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే సుప్రీంకోర్టు దెబ్బకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా దిగి వచ్చింది. మోదీ సారథ్యంలోని బీజేపీ సంకీర్ణ సర్కార్ తీసుకు వచ్చిన ఎలక్టోరల్ బాండ్ల పథకం పూర్తిగా భారత రాజ్యాంగ స్పూర్తికి విరుద్దమని స్పష్టం చేసింది ఈ మేరకు వెంటనే ఎవరెవరు, ఏయే సంస్థలు ఆయా పార్టీలకు ఎలక్టోరల్ బాండ్ల రూపంలో విరాళాలు అందజేశారో స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉందని పేర్కొంది ధర్మాసనం.
దీనిపై నాలుగు నెలల పాటు గడువు కావాలని కోరింది ఎస్బీఐ. విచారణ చేపట్టిన ధర్మాసనం నిప్పులు చెరిగింది. మార్చి 12 సాయంత్రం లోపు వివరాలను ఇవ్వాల్సిందేనని, లేకపోతే కోర్టు ధిక్కరణకు పాల్పడినట్టవుతుందని హెచ్చరించింది. దీంతో మోదీ నియమించిన ఎస్బీఐ చైర్మన్, ఎండీ హుటా హుటిన ఎలక్టోరల్ బాండ్ల వివరాలను అందజేసింది సుప్రీంకోర్టుకు.
ఇదే సమయంలో ఇందుకు సంబంధించిన మొత్తం వివరాలను కేంద్ర ఎన్నికల సంఘం ఈనెల 15న వెబ్ సైట్ లో (పబ్లిక్ డొమైన్ ) ఉంచాలని ఆదేశించింది. ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ఊరుకునే ప్రసక్తి లేదని ఈసీకి కూడా వార్నింగ్ ఇచ్చింది. ఇందుకు సంబంధించి రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. గడువు లోగా ఎలక్టోరల్ బాండ్ల కేసుకు సంబంధించి అన్ని వివరాలు ఇస్తామని స్పష్టం చేశారు.