విశాఖలో గంటా పోటీపై ఉత్కంఠ
బొత్సాపై పోటీ చేయాలని సూచన
విశాఖపట్నం – రాష్ట్రంలో రాజకీయాలు శర వేగంగా మారుతున్నాయి. నిన్నటి దాకా తెలుగుదేశం పార్టీలో కింగ్ మేకర్ గా పేరు పొందిన మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారారు. గురువారం తన నివాసంలో ఆయన సమాలోచనలు జరపడం కలకలం రేపుతోంది టీడీపీలో.
విచిత్రం ఏమిటంటే ముఖ్య నేతలు తరలి రావాలంటూ ఆదేశించారు. ప్రస్తుతం కీలక సమావేశం ఎందుకు జరుగుతోందనే దానిపై పార్టీ ఆరా తీస్తోంది. ప్రస్తుతం జరగబోయే శాసన సభ, పార్లమెంట్ ఎన్నికల్లో అనూహ్యంగా టీడీపీ చీఫ్ , మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు జనసేన , భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు. ఇది కేవలం రాష్ట్ర ప్రయోజనాల కోసమేనని పేర్కొన్నారు.
తాజాగా చీపురుపల్లి నుంచి మంత్రి బొత్స సత్యనారాయణపై పోటీ చేయాలని గంటా శ్రీనివాసరావును పార్టీ హై కమాండ్ ఆదేశించింది. అయితే ఇప్పటికే తాను విశాఖ నుంచి పోటీ చేస్తానని తనకు ఛాన్స్ ఇవ్వాలని గంటా చంద్రబాబును కోరారు. పోటీ చేస్తే చీపురుపల్లి నుంచి చేయాలని లేదంటే పార్టీ కోసం పని చేయాలని ఆదేశించారు. దీంతో రాజకీయ భవితవ్యంపై తీసుకోవాల్సిన నిర్ణయంపై చర్చిస్తున్నారు గంటా.