గద్దర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలి
డిమాండ్ చేసిన జిలుకర శ్రీనివాస్
హైదరాబాద్ – వీసీకే పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు , ప్రముఖ రచయిత, వక్త డాక్టర్ జిలుకర శ్రీనివాస్ కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఉద్యమానికి తన ఆట, పాటలతో ఊపిరి పోసిన మహోన్నత మానవుడు , ప్రజా యుద్ద నౌక గద్దర్ విగ్రహాన్ని హన్మకొండలో ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు విగ్రహ ఏర్పాటుకు సహకరించాలని కోరారు.
ఇందులో భాగంగా జిలుకర శ్రీనివాస్ సారథ్యంలోని కమిటీ సభ్యులు పరకాల ఎమ్మెల్యే ప్రకాశ్ రెడ్డిని కలిసింది. వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడారు. గద్దర్ విగ్రహ ఏర్పాటుకు తనవంతుగా సహాయం అందజేస్తానని జిలుకర శ్రీనివాస్ కు హామీ ఇచ్చారు.
గద్దర్ అంటే తనకు గౌరవం, అభిమానం అని అన్నారు. సంబంధిత అధికారుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకుపోయి, అనుమతుల కోసం సహకరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాలమహానాడు జాతీయ ఉపాధ్యక్షులు మన్నె బాబురావు మాట్లాడుతూ గద్దర్ అంటే ఈ దేశ ముఖచిత్రమని అన్నారు. ఆ మహనీయుని విగ్రహం హన్మకొండలోని అంబేద్కర్ చౌరాస్తాలో ఏర్పాటు చేయాలని సంకల్పించామని తెలిపారు.
ఈ కార్యక్రమంలో గద్దర్ విగ్రహ కమిటీ అధ్యక్షులు కోండ్ర నర్సింగరావు, ప్రధాన కార్యదర్శి జిలుకర శ్రీనివాస్, సలహాదారు మన్నె బాబురావు, ఉపాధ్యక్షులు గాజాల గోవర్ధన్, కార్యదర్శి మండలోజు కృష్ణ మూర్తి, ఉపాధ్యక్షులు చుంచు రాజేందర్, కార్యదర్శులు గద్దర్ సాంబయ్య, రవి ప్రసాద్, సాదు కుమారస్వామి, సంపత్ తదితరులు పాల్గొన్నారు.