పెద్దల ఆదేశాల మేరకే ఫోన్ ట్యాపింగ్
మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు కామెంట్స్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కలకలం రేపుతోంది. ఈ కేసుకు సంబంధించి అరెస్ట్ అయిన మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు విచారణలో కీలక విషయాలు వెల్లడించారు. అప్పటి ఉన్నతాధికారుల ఆదేశాల మేరకే తాను ట్యాపింగ్ చేసినట్లు చెప్పారు. ఇందుకు సంబంధించిన మొత్తం సమాచారాన్ని ఎప్పటికప్పుడు పై స్థాయి ఆఫీసర్లకు అందజేసినట్లు తెలిపారు.
ఇందులో వివిధ పార్టీలకు చెందిన ప్రజా ప్రతినిధులతో పాటు గతంలో అధికారంలో భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన నేతలు, ఉన్నతాధికారులు, మీడియాకు సంబంధించిన వారు, రియల్ ఎస్టేట్ పెద్దల ఫోన్లను ట్యాప్ చేశానని ఒప్పుకున్నారు.
అంతే కాకుండా కొంత మంది ప్రజా ప్రతినిధులు, అధికారులు కుటుంబ సభ్యుల ఫోన్లను కూడా ట్యాప్ చేశానన్నారు. చాలా మందికి సంబంధించిన వాట్సాప్ లపై కూడా నిఘా పెట్టానని స్పష్టం చేశారు ప్రణీత్ రావు. అప్పటి మాజీ చీఫ్ ఆదేశాల మేరకు సమాచారాన్ని ధ్వంసం చేశానని బాంబు పేల్చారు. సెల్ ఫోన్లు, హార్డ్ డిస్కులతో పాటు వేల సంఖ్యలో పత్రాలను కనిపించకుండా చేశానని ఒప్పుకున్నారు.