హత్య చేసినోళ్లకు జగన్ అండ
వైఎస్ వివేకా భార్య సౌభాగ్యమ్మ
కడప – దారుణ హత్యకు గురైన వైఎస్ వివేకానంద రెడ్డి భార్య సౌభాగ్యమ్మ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీలో త్వరలో ఎన్నికలు జరగనున్న తరుణంలో ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో కామెంట్ చేయడం కలకలం రేపుతోంది. శుక్రవారం ఆమె తన కూతురు డాక్టర్ వైఎస్ సునీతా రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
కేవలం రాజకీయ కారణాలతోనే తన భర్తను హత్య చేశారంటూ ఆరోపించారు. దివంగత సీఎం రాజశేఖర్ రెడ్డి, వివేకానందరెడ్డిలు పులివెందులలో ఫ్యాక్షన్ ను రూపు మాపారని చెప్పారు. అలాంటిది ఐదేళ్ల కిందట తమ ఇంట్లో ఘోరంగా హత్య చేశారని వాపోయారు.
తమ ఇంట్లోనే శత్రువులు ఉన్నారని అనుకోలేదని అన్నారు. తన భర్త వివేకానంద రెడ్డి హంతకులను జగన్ కాపాడుతున్నట్లు అనుమానాలు ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ రెడ్డి అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డిలను కాపాడుతున్నట్లు అనుమానం ఉందన్నారు సౌభాగ్యమ్మ.
2019 మార్చి 15న ఉదయం హత్య జరిగితే..జగన్ సాయంత్రానికి వచ్చారని ఆరోపించారు. ఆలస్యంగా రావడంపై తమకు అనుమానం ఉందన్నారు. హత్య కేసులో న్యాయం చేయాలని తామంతా వెళ్లి జగన్ ను కలిసినా స్పందించ లేదని ఆరోపించారు.