లాజిస్టిక్స్ తో ఆర్టీసీకి ఆదాయం
ఎండీ వీసీ సజ్జనార్ కామెంట్
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీఎస్ఆర్టీసీ) ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్ ఇప్పుడు లాభాల బాటలో పయనిస్తోందని పేర్కొన్నారు ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ వీసీ సజ్జనార్. నగరంలోని దిల్ షుఖ్ నగర్ బస్ స్టేషన్ ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన లాజిస్టిక్స్ మోడల్ కౌంటర్ ను ఎండీ ప్రారంభించారు.
ఈ సందర్బంగా కొత్త కౌంటర్ లో ఒక పార్శిల్ ను బుకింగ్ చేసి రశీదును వినియోగదారుడు శివకుమార్ కు ఆయన అందజేశారు. అనంతరం లాజిస్టిక్స్ విభాగానికి సంబంధించి కొత్త లోగో, బ్రోచర్ ను ఆర్టీసీ ఉన్నతాధికారులతో కలిసి ఆవిష్కరించారు. పార్శిళ్ల హోం పికప్, డెలివరీ కోసం వినియోగించే కొత్త వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు.
ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు. తమ సంస్థ ప్రతిరోజూ వేలాది మందిని తమ గమ్య స్థానాలకు చేర్చడంలో కీలక పాత్ర పోషిస్తోందని చెప్పారు వీసీ సజ్జనార్. తాను వచ్చాక లాజిస్టిక్స్ ను ప్రవేశ పెట్డడం జరిగిందని అన్నారు. దీనికి భారీ ఆదరణ లభిస్తోందని పేర్కొన్నారు. భవిష్యత్తులో ఆర్టీసీలో మరిన్ని సంస్కరణలకు శ్రీకారం చుడతామని స్పష్టం చేశారు.