నిప్పులు చెరిగిన మాజీ మంత్రి పార్థసారథి
అమరావతి : వైసీపీ పాలనా కాలంలో మొత్తం విధ్వంసం తప్ప జరిగింది ఏముందని ప్రశ్నించారు మాజీ మంత్రి కొలుసు పార్థసారథి. నాడు వివేకా నేడు దస్తగిరి వైసీపీ ‘రక్త చరిత్ర’ కాదా అని నిలదీశారు. ఏపీ రాజకీయ ప్రతిష్ఠను వైసీపీ అధః పాతాళానికి తొక్కేసిందని ఆరోపించారు. వైసీపీ మనుగడ మొత్తం విధ్వంసం భయాందోళనలు, హత్యల మీదనే సాగుతోందన్నారు. రాత్రికి రాత్రే చంపేయటం.. తెల్లవారేసరికి మొసలి కన్నీరు కార్చడం వైసీపీ నేతల నైజం తప్ప మరోటి కాదన్నారు. రవీంద్రనాథ్ రెడ్డి కుటుంబ సభ్యుల పేర్లపై ఉన్న 60కి పైగా డాక్యుమెంట్లు దస్తగిరి వద్ద ఎందుకున్నాయి? అని ఆగ్రహం వ్యక్తం చేశారు కొలుసు పార్థసారథి.
వాడుకొని వదిలేయడం, అవసరమైతే ‘ఎలిమినేట్’ చేయడం వైసీపీ విధానం అన్నారు. ఒకప్పుడు దేశ రాజకీయాల్లో ఎంతో గౌరవం, పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆంధ్రప్రదేశ్ రాజకీయ ప్రతిష్ఠను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సర్వ నాశనం చేశారని ఆరోపించారు మంత్రి. అధికారం, ఆస్తి కోసం వైసీపీ నేతలు ఎంతటి నీచానికైనా దిగజారుతారని ఆయన మండిపడ్డారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. వైసీపీ మనుగడ మొత్తం విద్వంసం, భయాందోళనలు, హత్యలు అనే మూడు రెక్కల మీద సాగిందని మంత్రి విమర్శించారు. వైఎస్ వివేకానంద రెడ్డి హత్య నుంచి నేటి దస్తగిరి హత్య వరకు ఆ పార్టీ అనుసరిస్తున్న పనితీరు ఒకేలా ఉందని ఆయన ఆరోపించారు.





