రెండు చోట్ల బీఎస్పీ పోటీ
ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ వెల్లడి
హైదరాబాద్ – బహుజన్ సమాజ్ పార్టీ చీఫ్ డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సంచలన ప్రకటన చేశారు. ట్విట్టర్ వేదికగా శుక్రవారం ఆయన పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా తెలంగాణలో బీఎస్పీ, బీఆర్ఎస్ కూటమిలో భాగంగా బీఎస్పీ తరపున నాగర్ కర్నూల్ ఎంపీ సీటుతో పాటు హైదరాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో బరిలో ఉండనున్నట్లు తెలిపారు.
బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తులో భాగంగా ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక ఈ రెండు సీట్లు వదిలేసి మొత్తం రాష్ట్రంలో ఉన్న 17 స్థానాలకు గాను 15 లోక్ సభ స్థానాలలో భారత రాష్ట్ర సమితి పార్టీకి చెందిన అభ్యర్థులు పోటీ చేస్తారని తెలిపారు.
రాబోయే రోజుల్లో తమ కూటమి అన్ని చోట్లా ఘన విజయం సాధించడం ఖాయమని ఆ నమ్మకం తనకు ఉందని పేర్కొన్నారు బీఎస్పీ చీఫ్ . ఇదే సమయంలో ఈ చారిత్రాత్మక ఒప్పందానికి అనుమతించిన బీయస్పీ అధినేత్రి, బెహన్జీ మాయావతికి, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆరెస్ అధినేత కేసీఆర్ కు ఈ సందర్బంగా ధన్యవాదాలు తెలియ చేస్తున్నానని స్పష్టం చేశారు.