పొత్తులో భాగంగా బీఎస్పీకి 2 సీట్లు
ప్రకటించిన మాజీ సీఎం కేసీఆర్
హైదరాబాద్ – మాజీ ముఖ్యమంత్రి, భారత రాష్ట్ర సమితి పార్టీ చీఫ్ కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. శుక్రవారం ట్విట్టర్ వేదికగా త్వరలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించి రెండు లోక్ సభ స్థానాలను పొత్తులో భాగంగా మాయావతి సారథ్యంలోని బహుజన్ సమాజ్ పార్టీకి కేటాయించినట్లు స్పష్టం చేశారు. ఈ మేరకు బీఆర్ఎస్ అధికారికంగా వెల్లడించింది.
రాష్ట్రంలో మొత్తం 17 లోక్ సభ స్థానాలు ఉన్నాయి. ఇందులో రెండు సీట్లు ఇచ్చేందుకు ఇరు పార్టీల నేతల మధ్య చర్చలు జరిగాయని తెలిపారు కేసీఆర్. తమ పార్టీ తరపున మిగతా 15 సీట్లలో బరిలో ఉంటారని స్పష్టం చేశారు.
ఇందులో భాగంగా రాష్ట్రంలోని ఎస్సీ రిజర్వ్ సీటు అయిన నాగర్ కర్నూల్ లోక్ సభ స్థానంతో పాటు హైదరాబాద్ ఎంపీ సీటును బీఎస్పీకి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు కేసీఆర్. తమ కూటమి కీలకంగా మారనుందని , ప్రస్తుతం రాష్ట్రంలో కొలువు తీరిన కాంగ్రెస్ సర్కార్ 100 రోజుల పాలన పట్ల ప్రజలు విసిగి పోయారని అన్నారు.
ఆరు గ్యారెంటీల పేరుతో జనం చెవుల్లో పూలు పెట్టారంటూ ఆరోపించారు కేసీఆర్.