బీజేపీకి షాక్ జితేందర్ జంప్
కాంగ్రెస్ లో చేరిన మాజీ ఎంపీ
హైదరాబాద్ – తెలంగాణ రాష్ట్రంలో రాజకీయాలు శర వేగంగా మారుతున్నాయి. పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో జంపింగ్ జిలానీలు ఎవరు ఎక్కడికి వెళుతున్నారో, ఏ పార్టీలో చేరుతున్నారో తెలియని పరిస్థితి నెలకొంది. ఇప్పటికే పలు సార్లు పార్టీలు మారిన చరిత్ర పాలమూరు మాజీ ఎంపీ , భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు ఆముదాలపాడు జితేందర్ రెడ్డి ఉన్నట్టుండి మనసు మార్చుకున్నారు.
తాను బీజేపీని వీడుతున్నట్లు ప్రకటించారు. ఆ మేరకు రాజీనామా చేస్తున్నట్లు స్పష్టం చేశారు జితేందర్ రెడ్డి. ఆ వెంటనే క్షణం ఆలస్యం చేయకుండా తన కొడుకును వెంట పెట్టుకుని గాంధీ భవన్ కు చేరుకున్నారు. తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్ , రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్ ఛార్జ్ దీపా దాస్ మున్షీ సారథ్యంలో కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు తండ్రీ కొడుకులు జితేందర్ రెడ్డి, మిథున్ రెడ్డి.
పాలమూరు నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆశించారు. కానీ హై కమాండ్ టికెట్ నిరాకరించింది. జితేందర్ రెడ్డికి బదులు డీకే అరుణకు టికెట్ కేటాయించింది. దీంతో సీఎం రేవంత్ రెడ్డి జితేందర్ రెడ్డి ఇంటికి స్వయంగా వెళ్లారు. పార్టీలోకి రావాలంటూ కోరారు.