కాంగ్రెస్..బీజేపీ ఒక్కటే
తన్నీరు హరీశ్ రావు కామెంట్
హైదరాబాద్ – రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎదుగుదలను చూసి ఓర్వలేక కాంగ్రెస్ , బీజేపీలు కలిసి పోయి వేధింపులకు పాల్పడుతున్నాయంటూ సంచలన ఆరోపణలు చేశారు మాజీ మంత్రి తన్నీరు హరీశ్ రావు. ప్రజలకు సేవ చేయడం కంటే ఇతరులను హింసించడం పనిగా పెట్టుకున్నారంటూ మండిపడ్డారు. ఓ వైపు సుప్రీంకోర్టులో కేసు నడుస్తోందని, విచారణ ఇంకా పూర్తి కాలేదని, తుది తీర్పు వెలువడకుండానే ఎలా ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారంటూ నిలదీశారు తన్నీరు హరీశ్ రావు.
ప్రజలు అన్నీ గమనిస్తున్నారని ఆరోపించారు. సార్వత్రిక ఎన్నికల్లో లబ్ది పొందేందుకే రేవంత్ రెడ్డి, మోదీ కలిసికట్టుగా కుట్ర పన్నారంటూ మండిపడ్డారు మాజీ మంత్రి. ఇది మంచి పద్దతి కాదన్నారు. తమకంటూ ఓ రోజు తప్పకుండా వస్తుందన్నారు.
కేసులు, అరెస్ట్ లు, వేధింపులు తమకు కొత్త కాదని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యమ కాలంలో ఇవన్నీ భరించే ఇక్కడి దాకా వచ్చామని అన్నారు. ముందస్తు సమాచారం లేకుండా అదుపులోకి తీసుకోవడం, ప్రత్యేకించి ఒక మహిళ అన్న సోయి లేకుండా ప్రవర్తించడం ఈడీకి మంచి పద్దతి కాదన్నారు తన్నీరు హరీశ్ రావు.