సిఫారసు లేఖలు రద్దు – టీటీడీ
ఎన్నికల కోడ్ నేపథ్యంలో నిర్ణయం
తిరుమల – దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలు లోకి వచ్చింది. ఎన్నికల సెడ్యూల్ ను ఖరారు చేసింది కేంద్ర ఎన్నికల సంఘం. దీంతో తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల కోడ్ ఉండడంతో వసతి, దర్శనంకు సంబందించి ఎలాంటి సిఫారసు లేఖలు స్వీకరించే ప్రసక్తి లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఈ విషయాన్ని ప్రకటించారు.
అయితే తిరుమలలో శ్రీనివాసుడి దర్శనం కోసం స్వయంగా వచ్చే ప్రోటోకాల్ ప్రముఖులకు నిబంధనల ప్రకారం శ్రీవారి దర్శనం, వసతి సౌకర్యం కల్పించడం జరుగుతుందన్నారు చైర్మన్. కోడ్ కారణంగా సిఫారసు లేఖలను రద్దు చేస్తున్నట్లు స్పష్టం చేశారు.
నిర్దేశించిన విధి విధానాల మేరకు దర్శనం, వసతి కల్పిస్తామని తెలిపారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యే వరకు ఏ రకమైన వసతి, దర్శనాలకు కూడా సిఫారసు లేఖలు స్వీకరించబడవని పేర్కొన్నారు భూమన కరుణాకర్ రెడ్డి.
కావున భక్త బాంధవులతో పాటు ప్రముఖులు, వీవీఐపీలు ఈ విషయాన్ని గుర్తించి తమతో సహకరించాల్సిందిగా చైర్మన్ కోరారు.