మోదీ నియంతృత్వానికి చెక్ పెట్టాలి
పిలుపునిచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్
హైదరాబాద్ – ఈ దేశంలో మోదీ నియంతృత్వం రాజ్యం ఏలుతోందని ఆవేదన వ్యక్తం చేశారు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్. దేశంలో ఎన్నికల నగారా మోగిందని, ఇవాల్టి నుంచే ఎన్నికల కోడ్ అమలులోకి వస్తుందన్నారు. ఈ సందర్భంగా వచ్చే మే 13న తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు జరగనున్నాయని చెప్పారు.
ఆయన మీడియాతో మాట్లాడారు. ఈ ఎన్నికల్లో బీజేపీ మోసాన్ని, మోదీ ఆధిపత్య ధోరణిని ఎండగట్టాలని, రాచరిక పాలనకు చరమ గీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజలు తమ విలువైన ఓటు అనే ఆయుధాన్ని ఉపయోగించు కోవాలని కోరారు.
ఆచరణకు నోచుకోని హామీలను ఇచ్చిన ఘనత మోదీకే దక్కుతుందన్నారు. జన్ ధన్ ఖాతా అన్నారు అది అడ్రస్ లేకుండా పోయిందన్నారు. కేవలం బడా బాబులు, పారిశ్రామికవేత్తలు, కార్పొరేట్ కంపెనీలు, అక్రమార్కులకే పెద్ద పీట వేస్తున్నారంటూ ధ్వజమెత్తారు. ప్రజా పాలన సాగిస్తున్న కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని కోరారు పొన్నం ప్రభాకర్ గౌడ్.