లిక్కర్ దందాలో కవిత క్వీన్
కస్టడీ పిటిషన్ లో కీలక అంశాలు
న్యూఢిల్లీ – ఢిల్లీ లిక్కర్ కుంభకోణంలో అసలైన సూత్రధారి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితేనంటూ బాంబు పేల్చింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ. మొత్తం ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంది. ఇందులో విస్తు పోయే అంశాలు ఉన్నాయి. అధికారాన్ని అడ్డం పెట్టుకుని లిక్కర్ దందా చేసిందని ఆరోపించింది. ఇందుకు సంబంధించిన ఆధారాలు సమర్పించింది కోర్టుకు.
బెయిల్ వస్తుందని ఆశించిన కవితకు బిగ్ షాక్ తగిలింది. 7 రోజుల పాటు కస్టడీకి పంపింది . మార్చి 23 దాకా విచారించనుంది. ఇక ఈడీ సమర్పించిన రిపోర్టులో దిమ్మ తిరిగే వాస్తవాలు వెలుగు చూశాయి. కవిత ఇతర వ్యక్తులతో కలిసి కుట్ర పన్నిందని, రూ. 100 కోట్ల కిక్ బ్యాక్ ల చెల్లింపుల్లో పాల్గొందని స్పష్టం చేసింది ఈడీ. మనీ లాండరింగ్ కు పాల్పడిందని ఆరోపించింది. రూ. 192.8 కోట్ల ఆదాయాన్ని ఆర్జించిందని తెలిపింది. రూ. 292.8 కోట్లలో కీలక పాత్ర ఉందని తెలిపింది.
2020-21 ఎక్సైజ్ పాలసీ రూపకల్పనలో ముఖ్య భూమిక పోషించినట్లు పేర్కొంది. అరుణ్ పిళ్లై ద్వారా ఇండో స్పిరిట్స్ లో భాగస్వామిగా ఉన్నారని ఈడీ వివరించింది. అభిషేక్ బోయిన్ పల్లి, బుచ్చి బాబు ద్వారా ఆప్ నాయకులకు డబ్బులను పంపిణీ చేసింది.
అభిషేక్ బోయిన్పల్లి ఆదేశాల మేరకు దినేష్ అరోరా కార్యాలయం నుండి నగదుతో కూడిన రెండు భారీ బ్యాగ్‌లను సేకరించి వినోద్ చౌహాన్‌కు అందించినట్లు తెలిపింది. వినోద్ చౌహాన్ గోవాలో ఆప్ ఎన్నికల ప్రచారానికి హవాలా మార్గంలో డబ్బులను బదిలీ చేశారని పేర్కొంది ఈడీ.
సౌత్ గ్రూప్‌లోని ఇతర సభ్యులు శరత్ రెడ్డి, రాఘవ్ మాగుంట , మాగుంట శ్రీనివాసుల రెడ్డి, ఆప్ అగ్ర నేతలతో కలిసి కుట్ర పన్నారని ఆరోపించింది. ఢీల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాతో కలిసి కవిత ఒప్పందం చేసుకున్నారని తెలిపింది.