ప్రజా గళం ప్రభంజనం
పిలుపునిచ్చిన మనోహర్
అమరావతి – కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల షెడ్యూల్ ప్రకటించడంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల వాతావరణం నెలకొంది. ఈ సందర్బంగా ఈసీ చేసిన ప్రకటన తర్వాత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తొలిసారిగా రాజకీయ సభలో ప్రసంగించడం తొలిసారి కావడం విశేషం.
మార్చి 17న ఆదివారం ఏపీలో టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఆధ్వర్యంలో ప్రజా గళం పేరుతో భారీ బహిరంగ సభ జరగనుంది. ఇప్పటికే పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, దగ్గుబాటి పురందేశ్వరి అన్నీ తామై చూసుకుంటున్నారు. ఎలాగైనా సరే జగన్ మోహన్ రెడ్డిని ఇంటికి పంపించాలని డిసైడ్ అయ్యారు.
ఇదిలా ఉండగా సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్ నాదెండ్ల మనోహర్. మూడు పార్టీలదీ విజయవంతమైన కలయికగా పేర్కొన్నారు. రాష్ట్రంలో రాక్షస పాలన సాగుతోందని, దీనికి చరమ గీతం పాడాల్సిన అవసరం ఉందన్నారు మనోహర్.
వైసీపీ అంతం తమ పంతం అని ప్రకటించారు ఏపీ టీడీపీ చీఫ్ అచ్చెన్నాయుడు. జగన్ రెడ్డిని జనం పట్టించు కోవడం మానేశారని అన్నారు. బీజేపీ చీఫ్ పురందేశ్వరి మాట్లాడుతూ ఎన్ని కుట్రలు పన్నినా తమ కూటమి విజయాన్ని అడ్డు కోలేరని ధీమా వ్యక్తం చేశారు.