27 నుంచి జగన్ బస్సు యాత్ర
20 రోజుల పాటు కొనసాగనున్న టూర్
అమరావతి – కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నిర్వహణకు షెడ్యూల్ ను ఖరారు చేసింది. దీంతో ఏపీలో రాజకీయ వాతావరణం మారి పోయింది. ఇప్పటికే టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి కూటమిగా ఏర్పడ్డాయి. ఇందులో భాగంగా ఆ కూటమి జగన్ రెడ్డిని ఇంటికి పంపించాలని డిసైడ్ అయ్యాయి. చిలకలూరిపేటలో ప్రజా గళం పేరుతో సభను నిర్వహించింది. ఈ సభకు మోదీ హాజరయ్యారు.
ఇదిలా ఉండగా ఇప్పటికే రాష్ట్రంలో కొలువు తీరిన వైసీపీ బాస్, సీఎం జగన్ మోహన్ రెడ్డి సంచలన ప్రకటన చేశారు. ఈసారి కూడా తానే సీఎం అవుతానని, విశాఖ కేంద్రంగా పాలన సాగిస్తానంటూ జోష్యం చెప్పారు. ఇందులో భాగంగానే తన వ్యూహాలకు పదును పెట్టారు. ఇప్పటికే ఒకే ఒక్క ఎంపీ సీటు తప్పించి శాసన సభ, లోక్ సభ స్థానాలకు తమ పార్టీ తరపున అభ్యర్థులను ఖరారు చేశారు. ఇడుపుల పాయ వేదికగా జాబితాను ప్రకటించారు.
175 అసెంబ్లీ స్థానాలకు 25 ఎంపీ స్థానాలకు గాను ఒక్క అనకాపల్లి తప్పించి 24 సీట్లకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఇదిలా ఉండగా ఈసారి ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని సీరియస్ గా తీసుకున్నారు. ఈనెల 27 నుంచి జగన్ రెడ్డి బస్సు యాత్ర చేపట్టనున్నట్లు పార్టీ ప్రకటించింది. సోమవారం ఇందుకు సంబంధించి వివరాలు తెలిపింది. ఇచ్చాపురం నుండి ఇడుపుల పాయ వరకు మేమంతా సిద్దం పేరుతో బస్సు యాత్ర చేపట్టనున్నట్లు పేర్కొంది.