ఓడిపోతే వచ్చే నష్టం ఏమీ లేదు
మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్
హైదరాబాద్ – మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ బాస్ కేసీఆర్ సంచలన కామెంట్స్ చేశారు. తాము అధికారం కోల్పోవడంపై కీలక వ్యాఖ్యలు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. బహుజన సమాజ్ పార్టీకి రాజీనామా చేసిన మాజీ ఐపీఎస్ ఆఫీసర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గులాబీ జెండా కప్పుకున్నారు. ఆయన కేసీఆర్ సమక్షంలో పార్టీలో చేరారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడారు కేసీఆర్.
ఒకసారి ఓడిపోతే వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. పాలనా పరంగా ఎవరు సమర్థులో ఇప్పుడు ప్రజలకు అర్థం అవుతోందన్నారు. గాడిద పోతేనే కదా గుర్రాల విలువ ఏమిటో తెలిసి వచ్చేదంటూ ఎద్దేవా చేశారు సీఎం రేవంత్ రెడ్డిని ఉద్దేశించింది. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కాంగ్రెస్ సర్కార్ పూర్తిగా విఫలమైందన్నారు.
ఒక నిబద్దత కలిగిన అధికారిగా పేరు పొందిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరడం ఆనందంగా ఉందన్నారు. మీలాంటి యువ నాయకులు ఎదిగితే ఇలా వచ్చి పోయే స్వార్థ పరులైన నేతల అవసరం ప్రజలకు ఉండదన్నారు కేసీఆర్. వచ్చే ఎన్నికల నాటికి మరింత బలపడాల్సిన అవసరం ఉందన్నారు నిరంతరం శిక్షణా తరగతులు నిర్వహిస్తామని, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కమిటీలను ఏర్పాటు చేస్తామని స్పష్టం చేశారు.
ప్రవీణ్ అంకిత భావం ఉన్న వ్యక్తి. అని, రెసిడెన్షియల్ విద్యా సంస్థలను దేశానికే ఆదర్శంగా తీర్చిదిద్దారని కొనియాడారు. ఆర్ఎస్పీని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శిగా త్వరలోనే ప్రకటిస్తామని చెప్పారు కేసీఆర్.