ఎలక్టోరల్ బాండ్స్ బిగ్ స్కామ్
నిప్పులు చెరిగిన మల్లికార్జున్ ఖర్గే
న్యూఢిల్లీ – ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే నిప్పులు చెరిగారు. మోదీ వచ్చాక ఈ దేశంలో అక్రమాలు పెరిగి పోయాయని ఆరోపించారు. బడా బాబులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ కంపెనీలకు , మోసగాళ్లకు, అక్రమార్కులకు, ఆర్థిక నేరగాళ్లకు ప్రధాన మంత్రి బహిరంగంగా వత్తాసు పలికారంటూ మండిపడ్డారు ఖర్గే.
అధికారాన్ని అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడిన వారి నుంచి పెద్ద ఎత్తున బీజేపీ ఎలక్టోరల్ బాండ్ల పేరుతో విరాళాలు అందుకుందని మల్లికార్జున్ ఖర్గే ఆరోపించారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఐటీ, సీబీఐ, ఈడీ లను తమ ఆధీనంలో పెట్టుకుని భయ భ్రాంతులకు గురి చేశారని ధ్వజమెత్తారు.
ఇందులో క్విడ్ ప్రో కింద కోట్లాది రూపాయలు తమ పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నం చేశారంటూ ఫైర్ అయ్యారు ఏఐసీసీ చీఫ్. సదరు సంస్థలు భారత దేశ సంపద మొత్తాన్ని మోదీని అడ్డం పెట్టుకుని కాజేయాలని చూస్తున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో చోటు చేసుకున్న ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడంలో మోదీ శ్రద్ద చూపడం లేదని ఆరోపించారు. రోజు రోజుకు బహిరంగంగా మతాన్ని రాజకీయం చేస్తూ ఓట్లు దండు కోవాలని చూశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.