DEVOTIONAL

చిలుకూరు అర్చ‌కుడి ఔదార్యం

Share it with your family & friends

ముస్లిం కుటుంబానికి ఆస‌రా

హైద‌రాబాద్ – దేశ వ్యాప్తంగా ముస్లిం, హిందూ పేరుతో ఆందోళ‌న‌లు చోటు చేసుకున్న ఈ త‌రుణంలో ఉన్న‌ట్టుండి ఓ ఆల‌య పూజారి త‌న ఉదార‌త‌ను చాటుకున్నారు. ఈ సంఘ‌ట‌న తెలంగాణ‌లో పేరు పొందిన చిలుకూరు బాలాజీ ఆల‌య ఫౌండ‌ర్ , ప్ర‌ధాన పూజారి సీఎస్ రంగ‌ రాజ‌న్. గ‌త కొంత కాలం నుంచి ఆల‌యం ఆధ్వ‌ర్యంలో ఆవుల‌ను, ఎద్దుల‌ను బ‌హుమ‌తిగా ఇచ్చే సంప్ర‌దాయానికి శ్రీ‌కారం చుట్టింది.

ఇదిలా ఉండ‌గా ఇటీవ‌లే విద్యుత్ షాక్ కార‌ణంగా పొలం ప‌నుల్లో ఉన్న ఎద్దును కోల్పోయాడు చిలుకూరు గ్రామానికి చెందిన రైతు మొహ‌మ్మ‌ద్ గౌస్. ఈ విష‌యం తెలుసుకున్న పూజారి గౌస్ కు ఎద్దును ఆల‌యం త‌ర‌పున అందించారు. కులం, మ‌తం అనేది మ‌నుషుల‌కే కానీ మాన‌వ‌త్వానికి కాద‌న్నారు. స‌హాయం చేయ‌డ‌మే ప‌ర‌మాత్ముడి సేవ అని పేర్కొన్నారు ఆల‌య పూజారి.

కొన్నేళ్ల క్రితం అంజియా అనే రైతుకు ఎద్దులను బహుమతిగా ఇచ్చారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని పెద్ద మంగళారం గ్రామానికి చెందిన అతను విద్యుదాఘాతంతో రెండు గేదెలను కోల్పోయాడు. ఆల‌య ప‌రంగా ఆదుకున్నారు.

గ‌త రెండు సంవ‌త్స‌రాల కాలంలో విద్యుత్ షాక్, పిడుగు పాటు, లేదా ఇత‌ర ఏ ప్ర‌మాదంలో ప‌శువుల‌ను కోల్పోయిన వారికి సీఎస్ రంగ రాజ‌న్ , గోసేవ ఔత్సాహికుడు ప‌వ‌న్ కుమార్ సాయంతో గోవులు, ప‌శువులు అంద‌జేస్తూ వ‌స్తున్నారు.