NEWSTELANGANA

పార్టీ మార‌డం అబ‌ద్దం

Share it with your family & friends

మాజీ మంత్రి శ్రీ‌నివాస్ గౌడ్

హైద‌రాబాద్ – మాజీ మంత్రి విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్ కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. తాను పార్టీ మారుతున్న‌ట్లు వ‌స్తున్న ప్ర‌చారాన్ని తిప్ప‌కొట్టారు. కొంద‌రు కావాల‌ని త‌న‌పై లేనిపోని ఆరోప‌ణ‌లు చేస్తున్నారంటూ మండిప‌డ్డారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు.

తాను ముందు నుంచీ తెలంగాణ ఉద్య‌మంలో కీల‌క పాత్ర పోషించాన‌ని, ఆ విష‌యం నాలుగ‌న్న‌ర కోట్ల ప్ర‌జ‌లంద‌రికీ తెలుస‌న్నారు. బ‌హుజ‌న వ‌ర్గాల‌కు చెందిన త‌న‌ను కావాల‌ని ఉన్న‌త వ‌ర్గాల‌కు చెందిన వారు టార్గెట్ చేశార‌ని ఆరోపించారు. ఇది ఎంత మాత్రం మంచి ప‌ద్ద‌తి కాద‌న్నారు.

రాజ‌కీయాల‌లో గెలుపు ఓట‌ములు స‌హ‌జ‌మ‌ని, అయినంత మాత్రాన ప‌నిగ‌ట్టుకుని బ‌ద్నాం చేసే ప్ర‌య‌త్నం చేయ‌డం మానుకోవాల‌ని హిత‌వు ప‌లికారు. ప్ర‌జా తీర్పు ఇవాళ రేవంత్ రెడ్డికి అనుకూలంగా వ‌చ్చి ఉండ‌వ‌చ్చ‌ని, రేపొద్దున తిరిగి త‌మ వైపు రానుంద‌ని జోష్యం చెప్పారు.

వ్య‌క్తిగ‌తంగా విమ‌ర్శ‌లు చేయ‌డం మానుకోక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని హెచ్చ‌రించారు విర‌స‌నోళ్ల శ్రీ‌నివాస్ గౌడ్. అయితే తాను బీఆర్ఎస్ ను వీడుతున్న‌ట్లు, బీజేపీలో చేర‌బోతున్న‌ట్లు జ‌రుగుతున్న ప్ర‌చారాన్ని తిప్పి కొట్టారు. అయోధ్య‌ను ద‌ర్శించినంత మాత్రాన కాషాయ జెండా క‌ప్పుకుంటానంటే ఎలా అని ప్ర‌శ్నించారు.