కోడ్ ఎఫెక్ట్..ఇంటి నుంచే పాలన
ప్రకటించిన సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్ – కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీంతో దేశ వ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిందని ప్రకటించారు కేంద్ర ఎన్నికల కమిషనర్ రాజీవ్ కుమార్. దీంతో టీపీసీసీ చీఫ్, సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇక నుంచి రెండు నెలల పాటు అంటే వచ్చే జూన్ 4 వ తేదీ వరకు తాను సచివాలయానికి రానంటూ పేర్కొన్నారు.
ఇక నుంచి మార్చి 21వ తేదీ శుక్రవారం నుండి ఇంటి వద్ద నుండే పాలనా పరంగా నిర్ణయాలు తీసుకుంటానని స్పష్టం చేశారు. మొత్తంగా 2 నెలల పాటు సచివాలయానికి దూరంగా ఉండనున్నట్లు పేర్కొన్నారు సీఎం.
ఎన్నికల కోడ్ నేపథ్యంలో పార్టీపై ఫోకస్ పెట్టినట్లు తెలిపారు. ఆయన టీపీసీసీ చీఫ్ గా కూడా వ్యవహరిస్తున్నారు. పార్టీ పరంగా వ్యూహాలు పన్నడం, అభ్యర్థులను ఖరారు చేయడం, ఎన్నికల ప్రచారంలో భాగంగా, సభలు, సమావేశాలు, ర్యాలీలలో హాజరు కానున్నట్లు తెలిపారు.
కోడ్ కారణంగా ఇక నుంచి 60 రోజుల పాటు ఇంటి నుండి, గాంధీ భవన్ నుండి పార్టీ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. అవసరమైతే ఇక్కడి నుంచే అధికారులతో సమీక్ష చేయనున్నట్లు స్పష్టం చేశారు.