NEWSANDHRA PRADESH

ఏపీలో 144 సెక్ష‌న్ – ఈసీ

Share it with your family & friends

ఎవ‌రైనా స‌రే ప‌ర్మిష‌న్ తీసుకోవాల్సిందే

విజ‌య‌వాడ – ఏపీ ఎన్నిక‌ల అధికారి ముఖేష్ కుమార్ మీనా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో 144 సెక్ష‌న్ అమ‌లు జ‌రుగుతోంద‌న్నారు. ఎవ‌రైనా స‌రే ఈసీ రూల్స్ పాటించాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. ఎన్నిక‌ల కోడ్ అమ‌లులో ఉన్నందున , జాగ్ర‌త్త‌తో నాయ‌కులు వ్య‌వ‌హ‌రించాల‌ని సూచించారు. ఎప్ప‌టిక‌ప్పుడు ఈసీ ప‌ర్య‌వేక్షిస్తూనే ఉంటుంద‌ని హెచ్చ‌రించారు.

ఇందుకు సంబంధించి ఎన్నిక‌ల సంఘం సువిధ యాప్ ను రూపొందించిన‌ట్లు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు 392 ద‌ర‌ఖాస్తుల‌ను ప‌రిష్క‌రించిన‌ట్లు చెప్పారు ఎన్నిక‌ల అధికారి. ఎక్కువ‌గా వాలంటీర్లు, ఒప్పంద ఉద్యోగులపై ఫిర్యాదులు వచ్చాయ‌ని వెల్ల‌డించారు. ఇప్ప‌టి వ‌ర‌కు 46 మందిపై చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని పేర్కొన్నారు.

కొందరు వాలంటీర్లను విధుల నుంచి తొలగించామ‌ని చెప్పారు. ప్రభుత్వ భవనాలపై నేతల ఫొటోలు, ప్రకటనలు తొలగించాలని ఆదేశించామ‌న్నారు . ఉద్యోగులు ప్రజా ప్రతినిధులతో కలిసి తిరగ కూడదని అన్నారు ముఖేష్ కుమార్ మీనా.

ఎప్పటికప్పుడు ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ తనిఖీలు చేసి కేసులు నమోదు చేస్తుందన్నారు. సీ విజిల్‌ యాప్‌లో నమోదైన ఫిర్యాదులపై 100 నిమిషాల్లో చర్యలు తీసుకుంటున్నామ‌ని పేర్కొన్నారు. దీని ద్వారా ఎవ‌రైనా స‌రే ఫోటో, వీడియో తీసి పంప‌వ‌చ్చ‌ని తెలిపారు.

ఇప్పటి వరకు 1.99 లక్షల పోస్టర్లు, బ్యానర్లు, హోర్డింగ్‌లు తొలగించామ‌ని వెల్ల‌డించారు. 385 ఎఫ్ఐఆర్‌లు నమోదు చేశామ‌ని అన్నారు సీఈవో . 3 రోజుల్లో రూ.3.39 కోట్ల విలువైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నామ‌ని అన్నారు.

ప్రస్తుతం తనిఖీల్లో 173 బృందాలు పాల్గొంటున్నాయ‌ని స్పష్టం చేశారు. డీఎస్సీపై విద్యాశాఖ వివరణ కోరామ‌న్నారు . డీఎస్సీ నిర్వహణపై సీఈసీకి లేఖ రాస్తామ‌న్నారు. ఉస్తాద్ భగత్‍సింగ్ సినిమా టీజర్ నేను చూడలేదన్నారు ముకేష్ కుమార్ మీనా.

టీజర్ పొలిటికల్ ప్రచారం తరహాలో ఉంటే ఈసీ అనుమతి తీసుకోవాల్సిందేన‌ని స్ప‌ష్టం చేశారు. రాజకీయ హింస జరగకుండా చూడాలన్నదే త‌మ‌ లక్ష్యమ‌న్నారు. హింస రహిత, రీపోలింగ్ లేని ఎన్నికలే లక్ష్యంగా పని చేస్తున్నామ‌ని చెప్పారు. గిద్దలూరు, ఆళ్లగడ్డలో రాజకీయ హత్యలు జరిగాయ‌ని తెలిపారు.