ఏపీలో 45 మంది సలహాదారులు
నిమ్మగడ్డ రమేష్ కుమార్ కామెంట్స్
అమరావతి – సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన ఏపీ సర్కార్ ను లక్ష్యంగా చేసుకుని కీలక వ్యాఖ్యలు చేయడం కలకలం రేపింది. ఏపీలో ఏకంగా 45 మంది సలహాదారులు ఉన్నారని ఆరోపించారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అనంతరం వారిని నియమించారంటూ మండిపడ్డారు.
ఈ నియామకం కచ్చితంగా ఎన్నికల కోడ్ ను ఉల్లంఘించడమేనని పేర్కొన్నారు. కన్సాలిడేటెడ్ ఫండ్ నుంచి ప్రయోజనం పొందే ఎవరైనా ఎన్నికల కోడ్, సేవా నిబంధనలకు కట్టుబడి ఉండాల్సిందేనని స్పష్టం చేశారు. నిమ్మగడ్డ రమేష్ కుమార్ మీడియాతో మాట్లాడారు.
చాలా మంది సలహాదారులు రాజకీయ పాత్ర పోషిస్తున్నారని, రాజకీయ చర్చలలో బిజీగా మారారని ఆవేదన వ్యక్తంచేశారు. రాజీనామా తర్వాతే సలహాదారులు రాజకీయ ప్రసంగం చేయొచ్చన్నారు.
కొంతమంది సలహాదారులు ప్రభుత్వ సదుపాయాలు పొందుతూ వైసీపీ ఆఫీసుల ఆవరణలోనే రాజకీయ ప్రసంగాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు.
వీటన్నింటి గురించి ఏపీ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్ ముఖేష్ కుమార్ మీనా దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందన్నారు.