మోదీపై మాలిక్ కన్నెర్ర
ప్రధానమంత్రి ఓ నియంత
న్యూఢిల్లీ – జమ్మూ కాశ్మీర్ మాజీ గవర్నర్ సత్య పాల్ మాలిక్ నిప్పులు చెరిగారు. ఆయన మీడియాతో మాట్లాడారు. ఆప్ చీఫ్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టారు. ప్రధానమంత్రిగా ఉన్న మోదీ ఓ నియంత లాగా వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశంలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
ఎన్నికలకు ముందు కేజ్రీవాల్ ను అరెస్ట్ చేయడం దారుణమన్నారు. రాజకీయంగా ఎదుర్కోలేక దొడ్డి దారిన కేంద్ర దర్యాప్తు సంస్థల పేరుతో అదుపులోకి తీసుకోవడం పూర్తిగా చట్ట విరుద్దమన్నారు. రాబోయే రోజుల్లో ప్రజలు తగిన రీతిలో బుద్ది చెప్పడం ఖాయమని జోష్యం చెప్పారు సత్యపాల్ మాలిక్.
సీఎంను అరెస్ట్ చేయడం ద్వారా మోదీ ప్రభుత్వం తన శవ పేటికకు చివరి మేకు వేసిందంటూ సంచలన కామెంట్స్ చేశారు మాజీ గవర్నర్. ఇకనైనా ప్రధాని తన తీరును మార్చుకోవాలని సూచించారు. లేక పోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని పేర్కొన్నారు.