మోదీ సర్కార్ బేకార్
రాకేశ్ టికాయత్ ఫైర్
ఉత్తర ప్రదేశ్ – రైతు ఉద్యమ నాయకుడు రాకేశ్ తికాయత్ నిప్పులు చెరిగారు. ఆయన మరోసారి మోదీ సర్కార్ ను ఏకి పారేశారు. రైతులను నిట్ట నిలువునా ముంచుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం బడా బాబులు, వ్యాపారవేత్తలు, కార్పొరేట్ కంపెనీలకు లబ్ది చేకూరేలా నిర్ణయాలు తీసుకుంటున్నారని మండిపడ్డారు. అయినా రైతుల తరపున ఉద్యమం ఆగదని స్పష్టం చేశారు. తాను ఎన్నికల్లో గెలుస్తానని సంబరపడి పోతున్నారంటూ ఎద్దేవా చేశారు మోదీ గురించి రాకేశ్ తికాయత్.
కేసులు నమోదు చేసినా, అరెస్ట్ లు చేసి జైళ్లో బంధించినా, చివరకు నామ రూపాలు లేకుండా చేసినా తాము వెనక్కి తగ్గే ప్రసక్తి లేదన్నారు రైతు అగ్ర నేత. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇవాళ దేశంలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేకుండా పోయిందన్నారు.
బంగాళ దుంప (ఆలుగడ్డ), ఉల్లిగడ్డ రైతులు తీవ్రంగా నష్ట పోయారని, పెట్టిన పెట్టుబడి రాక కంట తడి పెట్టారని అయినా మోదీ కనికరించడం లేదని ధ్వజమెత్తారు రాకేశ్ తికాయత్. ప్రస్తుతం భారీ డిమాండ్ ఉన్న ఆవాలును సైతం ఎంఎస్పీ కంటే తక్కువ ధర చెల్లించి కొనుగోలు చేయడం ఎంత వరకు సబబు అని ప్రశ్నించారు.