మేం యాచకులం కాదు – సీఎం
కేంద్ర సర్కార్ పై మాన్ ఆగ్రహం
పంజాబ్ – మోదీ బీజేపీ సర్కార్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందంటూ ధ్వజమెత్తారు పంజాబ్ సీఎం భగవంత్ మాన్. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు. ఎలాంటి ఆధారాలు లేక పోయినప్పటికీ తమకు కంటగింపుగా మారాడని ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను టార్గెట్ చేశారని వాపోయారు.
ఈ దేశ చరిత్రలో ఒక ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఈడీ అదుపులోకి తీసుకోవడం ఎప్పుడూ జరగలేదన్నారు. ఇది పూర్తిగా అక్రమమని, రాజ్యాంగ విరుద్దమని ఆవేదన వ్యక్తం చేశారు సీఎం భగవంత్ మాన్. ఇప్పటి వరకు పలుమార్లు ఈడీ సోదాలు చేపట్టిందని, ఒక్క పైసా కూడా దొరక లేదన్నారు .
ఇదే సమయంలో పంజాబ్ రాష్ట్రానికి సంబంధించిన కేంద్రం నుంచి రావాల్సిన ఆర్డీఎఫ్ డబ్బులను కూడా నిలిపి వేశారని మండిపడ్డారు మాన్. తాము యాచించాల్సిన అవసరం లేదన్నారు . ఇదే విధంగా ప్రతిసారి కోర్టును కేజ్రీవాల్ ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు. ఇకనైనా కేంద్రం తన పనితీరును మార్చుకోవాలని సూచించారు సీఎం. లేక పోతే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు.