డ్రగ్స్ తో ఓట్లు కొల్లగొట్టేందుకు కుట్ర
నిప్పులు చెరిగిన డాక్టర్ కేఏ పాల్
విజయవాడ – ప్రజాశాంతి పార్టీ చీఫ్ డాక్టర్ కేఏ పాల్ నిప్పులు చెరిగారు. రాష్ట్రంలో వైసీపీ పాలన అస్తవ్యస్తంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. బెజవాడ గాంధీనగర్ లోని ఐలాపురంలో మీడియాతో మాట్లాడారు.
25 వేల కేజీల డ్రగ్స్ పట్టుబడటం దారుణమన్నారు. ఇది జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపుతుందన్నారు డాక్టర్ కేఏ పాల్. పక్కా ప్లాన్ ప్రకారమే రాష్ట్రంలోకి భారీ ఎత్తున డ్రగ్స్ ను డంప్ చేశారని ఆరోపించారు.
ఎన్నికల్లో డ్రగ్స్ ను సరఫరా చేసి, ప్రజలను మత్తులో ముంచేసి బహిరంగంగానే తమ పార్టీని గెలిపించుకుందుకే వీటిని ఇక్కడికి తీసుకు వచ్చారంటూ ధ్వజమెత్తారు. ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐతో విచారణ చేపట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
ఏపీ నుంచి తెలంగాణ, ఒడిస్సా రాష్ట్రాలకు డ్రగ్స్ పంపిస్తున్నారంటూ సంచలన కామెంట్స్ చేశారు కేఏ పాల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అమెరికా లాగా చేసే సత్తా తన ఒక్కడికే ఉందని ప్రకటించారు. ఇవాళ రాష్ట్రంలో ఉన్న అన్ని వ్యవస్థలను సర్వ నాశనం చేశారంటూ మండిపడ్డారు.