కవిత బంధువుల ఇళ్లల్లో సోదాలు
రంగంలోకి దిగిన కేంద్ర దర్యాప్తు సంస్థ
హైదరాబాద్ – బీఆర్ఎస్ బాస్ , మాజీ సీఎం కేసీఆర్ కు బిగ్ షాక్ తగిలింది. ఓ వైపు సీనియర్ నాయకులు జంప్ అవుతుంటే మరో వైపు తన ముద్దుల కూతురు , ఎమ్మెల్సీ కవితను ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్ట్ చేశారు. ఆమెతో పాటు తను మద్దతు ఇచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను సైతం అరెస్ట్ చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ.
ఇదిలా ఉండగా లిక్కర్ స్కామ్ లో కీలకమైన పాత్ర పోషించిందంటూ కవితపై సంచలన ఆరోపణలు చేసింది ఈడీ. కోర్టుకు సుదీర్ఘమైన రిపోర్టు ఇచ్చింది. ఇద్దరినీ ప్రశ్నించేందుకు కస్టడీ ఇవ్వాలని కోరింది. ఇందులో భాగంగా కవిత, కేజ్రీవాల్ ను విచారణ చేపట్టింది.
ఏకంగా కల్వకుంట్ల కవిత రూ. 100 కోట్లను తరలించిందని, హవాలా రూపంలో ఆప్ కు అందజేశారని స్పష్టం చేసింది. ఇందుకు సంబంధించి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని పేర్కొంది. ఇదిలా ఉండగా కవితకు షాక్ ఇచ్చింది ఈడీ. శనివారం ఊహించని విధంగా కవిత బంధువుల ఇళ్లల్లో సోదాలు చేపట్టింది. హైదరాబాద్ లోని పలు చోట్ల దాడులు చేపట్టింది. కవిత ఆడబిడ్డ అఖిల నివాసంలో సోదాలు కొనసాగించింది. దీంతో కల్వకుంట్ల కుటుంబంలో గుబులు బయలు దేరింది.