కేజ్రీవాల్ ను ముట్టుకుంటే అధోగతే
పంజాబ్ సీఎం భగవంత్ మాన్
న్యూఢిల్లీ – పంజాబ్ ముఖ్యమంత్రి భగవంత్ మాన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ పార్టీ నాయకుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ అదుపులోకి తీసుకోవడాన్ని తప్పు పట్టారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో మద్యం పాలసీని రూపొందించారని, ఇందులో కీలకంగా కింగ్ పిన్ గా వ్యవహరించారంటూ ఆరోపించడాన్ని తీవ్రంగా ఖండించారు . ఇది మంచి పద్దతి కాదన్నారు.
దేశంలో బీజేపీ మాత్రమే ఉండాలని అనుకుంటుందని, ప్రతిపక్షాలు లేకుండా చేయాలని కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. శనివారం దేశ రాజధాని ఢిల్లీలో ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళన చేపట్టారు. ఈ సందర్బంగా పంజాబ్ సీఎం మాట్లాడారు.
అరవింద్ కేజ్రీవాల్ వ్యక్తి కాదని ఆయన ఓ శక్తి అని అన్నారు. ఈ దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా రాష్ట్రాన్ని అభివృద్ది పథంలో పయనించేలా కృషి చేశారంటూ కితాబు ఇచ్చారు. ఆయన అద్బుతమైన ఆలోచన అని పేర్కొన్నారు. అది బయటకు వచ్చి దేశమంతటా ఓ విప్లవంలా విస్తరించక తప్పదని హెచ్చరించారు భగవంత్ మాన్.
యావత్ ప్రపంచమంతా ప్రచురణ, ప్రసార , డిజిటల్ మీడియాలలో ప్రధానంగా అరవింద్ కేజ్రీవాల్ అరెస్ట్ గురించి ప్రస్తావించారని తెలిపారు.