మీ ఆరు గ్యారెంటీలు మాకొద్దు
పిల్లల బతుక్కి గ్యారెంటీ ఇవ్వండి
హైదరాబాద్ – బీఆర్ఎస్ నాయకుడు, నాగర్ కర్నూల్ పార్లమెంట్ అభ్యర్థి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. శనివారం బీఆర్ఎస్ లో పలువురు చేరారు. ఈ సందర్భంగా ఆర్ఎస్పీ మాట్లాడారు. ఆయన రాష్ట్రంలో కొలువు తీరిన సీఎం రేవంత్ రెడ్డిని, ఆయన ప్రభుత్వాన్ని ఏకి పారేశారు. గత కొంత కాలంగా తను తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. ఇవాళ కూడా అదే స్థాయిలో మరింత డోసు పెంచారు.
మీరు ఇచ్చే ఆరు గ్యారెంటీలు ఇప్పుడు అవసరం లేదన్నారు. పిల్లల బతుకులకు గ్యారెంటీ ఇచ్చేందుకు ప్రయత్నం చేయాలని స్పష్టం చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. గ్యారెంటీల పేరుతో ప్రజలను మోసం చేశారని , ఇవాళ సామాజిక వర్గాలకు అన్యాయం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది ఎంత మాత్రం మంచి పద్దతి కాదన్నారు.
ఇతర పార్టీల నుంచి నేతలను చేర్చుకోవడంలో ఉన్నంత శ్రద్ద ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించేందుకు రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయడం లేదని ఆరోపించారు ఆర్ఎస్పీ. ఇకనైనా మార్పు రావాల్సిన అవసరం ఉందన్నారు.