ఏపీలో 170 సీట్లు గెలుస్తాం
నారా చంద్రబాబు నాయుడు
విజయవాడ – ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరగబోయే శాసన సభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ కూటమి తప్పకుండా విజయం సాధించడం ఖాయమని జోష్యం చెప్పారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు, మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడు. బెజవాడలో ఎన్డీఏ ఆధ్వర్యంలో వర్కు షాపు చేపట్టారు. ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు.
ప్రధానంగా టీడీపీ, జనసేన అభ్యర్థుల ఎంపిక మీద కృషి చేయడం జరిగిందని చెప్పారు. అయితే పొత్తు పరంగా కొన్ని ఇబ్బందులు ఏర్పడిన మాట వాస్తవమేనని పేర్కొన్నారు. పవన్ కళ్యాణ్ పార్టీకి కనీసం 30 సీట్లు ఇవ్వాలని అనుకున్నామని , కానీ వర్కవుట్ కాలేదన్నారు చంద్రబాబు నాయుడు.
అయితే వాళ్లు చేసిన త్యాగం గొప్పదని ప్రశంసించారు. ఏది ఏమైనా , జగన్ రెడ్డి ఎన్ని కుట్రలు పన్నినా, ఎన్ని జిమ్మిక్కులు చేసినా టీడీపీ కూటమి విజయాన్ని అడ్డు కోలేదన్నారు టీడీపీ చీఫ్. రాష్ట్రంలో తమ కూటమికి కనీసం 170 సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
ఇక లోక్ సభ స్థానాలకు సంబంధించి 25 ఎంపీ సీట్లకు గాను తమ కూటమికి 24 సీట్లకు పైగా వస్తాయని అన్నారు నారా చంద్రబాబు నాయుడు.